డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంలో చుక్కెదురు
ఆరు ముస్లిం ప్రాబల్య దేశాల వారి అమెరికా ప్రవేశంపై నిషేధం విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిషేధం పరిధిలోకి అమెరికా నివాసితుల తాతలు, అవ్వలు, మనుమలు, ఇతర సమీప బంధువులను తీసుకురావాలన్న ఆయన ప్రయత్నాలకు న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. సుప్రీం నిర్ణయం ప్రకారం అమెరికా వెళ్లాలనుకునే ఇరాన్, లిబియా, సొమాలియా, సుడాన్, సిరియా, యెమెన్ దేశాల్లోని అమెరికన్ల సమీప బంధువులకు 90 రోజుల ప్రవేశ నిషేధం వర్తించదు. కోర్టు ప్రస్తుతం తాత్కాలిక ఉత్తర్వులనే ఇచ్చింది. తుది నిర్ణయం అక్టోబరులో వెలువడనుంది.








