అమెరికాలో వలసల నిషేధం అమల్లోకి..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊరట. 6 ముస్లిం ప్రధాన దేశాల నుంచి వ్యక్తుల రాకపై ఆయన విధించిన వివాదస్పద నిషేధాజ్ఞలను ఆ దేశ సుప్రీంకోర్టు పాక్షికంగా పునరుద్ధరించింది. అమెరికాలోని సంస్థలు లేదా వ్యక్తులతో విశ్వసనీయ సంబంధం లేని వ్యక్తులపై ( ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్న 6 దేశాలకు చెందినవారు) అక్టోబరు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అక్టోబరులో ఈ కేసును తాము పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని తెలిపింది. అమెరికాతో వ్యక్తిగత సంబంధాలున్న వ్యక్తులపై ప్రస్తుతానికి ఆంక్షలను అమలు చేయకూడదని పేర్కొంది. కుటుంబ సభ్యులను చూసేందుకు, విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు వచ్చే విదేశీయులకు అందుకు ఉదహరిచింది. మరో వైపు, అమెరికాలో సంబంధం లేని విదేశీయుల రాకపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కూడా సుప్రీంకోర్టు సృష్టం చేసింది. ముస్లిం ప్రధాన దేశాలైన ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఈ ఏడాది జనవరిలో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.








