మరో మూడు దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్
యూఎస్ మరో మూడు దేశాల పౌరులపై తాజాగా నిషేధం విదించింది. ఉత్తర కొరియా, వెనెజులా, చాద్ను తమ నిషేధిత జాబితాలో అమెరికా చేర్చింది. ఇదివరకే ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ దేశాలపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఇరాన్, లిబియా, సొమాలియా దేశాలపై విధించిన 90 రోజుల ఆంక్షల గడువు ముగియడంతో మళ్లీ పొడిగించింది. సూడాన్ దేశ పౌరులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం అమెరికా నిషేధించిన దేశాల జాబితా ఎనిమిదికి చేరుకున్నది. నిషేధ ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. వచ్చే అక్టోబర్ 18 నుంచి ఈ మూడు దేశాలపై నిషేధం అమల్లోకి రానుంది. అమెరికా భద్రత ముప్పు, యూఎస్ అధికారులతో ఆయా దేశాలు ప్రవర్తించే తీరు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ దేశాలను కూడా నిషేధించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.













