సెనేట్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురు
గత అధ్యక్షుడు ఒరాక్ ఒబామా హయాంలో అమలులోకి వచ్చిన ఒబామాకేర్ చట్టాన్ని రద్దు చేసేందుకు సంబంధించిన బిల్లుపై సెనేట్‌లో మెజార్టీ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేయటంతో అధ్యక్షుడు ట్రంప్‌కు చుక్కెదురైంది. సెనేట్‌లో ఈ బిల్లును నెగ్గించుకోవటానికి తమ పార్టీకి చెందిన 52 మందిలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ఒబామా కేర్ చట్టాన్ని రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ సభ్యులు ప్రతిపాదించిన వెంటనే సెనేటర్ టెడ్ క్రూజ్ దానికి తీవ్రంగా వ్యతిరేకించారు. మరో సెనేటర్ సుసాన్ కాలిన్స్ ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతానికి తాను ఈ బిల్లుకు ఓటు వేయటం లేదని, సెనేటర్ మైక్ లీ కూడా దీని అనుకూలంగా ఓటు వేయబోరని తాను భావిస్తున్నానని క్రూజ్ ప్రతినిధి ఫిల్ నోవాక్ చెప్పారు. ఒబామాకేర్ చట్టాన్ని రద్దుచేసేందుకు ఉద్దేశించిన బిల్లులో ప్రజల ఆరోగ్య వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను ప్రకటించలేదని క్రూజ్ ఫిర్యాదు చేసినట్లు నోవాక్ వివరించారు. ఈ బిల్లును సత్వరమే ఆమోదించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ సెనేటర్ సుసాన్ కాలిన్స్ సైతం దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.













