ఒబామాకేర్ కథ ముగిసింది : ట్రంప్
ఒబామాకేర్కు కష్టకాలం వచ్చింది. ఒబామాకేర్ ఆరోగ్య బీమా పథకాన్ని రద్దు చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం ముందుకు వెళ్లుతున్నది. ఒబామాకేర్ను రద్దు చేయాలంటూ దిగువ సభ కాంగ్రెస్‌లో జరిపిన ఓటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. ఒబామాకేర్ స్థానంలో ట్రంప్ ప్రభుత్వం రిపబ్లికన్ హెల్త్ కేర్ బిల్లును ప్రవేశ పెట్టింది. ఆ బిల్లుకు దిగువ సభలో ఆమోదం దక్కింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న ఆశయాలను నెరవేరే అవకాశాలున్నాయి. ఒబామాకేర్ రద్దు చేయాలంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 217 మంది, వ్యతిరేకంగా 213 మంది ఓటేశారు. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను డెమోక్రాట్లు వ్యతిరేకించారు. ఒబామాకేర్ను రద్దు చేయడం వల్లే లక్షలాది మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోతారు అని డెమోక్రాట్లు ఆరోపించారు. దిగువ సభలో ఆమోదం పొందిన బిల్లు ఇప్పుడు సేనేట్‌కు వెళ్తుంది. అయితే సేనేట్‌లో బిల్లును మార్చి కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌లో జరిగిన ఓటింగ్‌లో స్వల్ప మెజారిటీతో ట్రంప్ వర్గం విక్టరీ సాధించింది. దీంతో నిరసనకారులు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిపబ్లికన్ హెల్త్ కేర్ బిల్లుకు ఆమోదం దక్కడం వల్ల ఒబామాకేర్ చనిపోయిందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ల హెల్త్ కేర్ బిల్లు వల్ల పేదలు ఇన్సూరెన్స్ కోల్పోతారు అని డెమోక్రాట్లు ఆరోపించారు. హాస్పటల్, డాక్టర్లకు చెందిన కొన్ని గ్రూపులు కూడా రిపబ్లికన్ హెల్త్ కేర్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 2010లో ప్రవేశపెట్టిన ఒబామాకేర్ పథకం కింద సుమారు రెండు కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ పొందారు.








