ప్రభుత్వాన్ని మూసేసైనా గోడ కడతా!
అమెరికా పౌరుల భద్రతకు విఘాతం కలిగిస్తున్న పరిణామాలను అడ్డుకుంటానని, ఇందులో భాగంగా మెక్సికోతో ఉన్న సరిహద్దు పొడవునా గోడ కడతానంటూ డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రాతిపాదనను వ్యతిరేకించడం ద్వారా డెమోక్రాట్లు మొత్తం అమెరికా ప్రజల భద్రతనే ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన అన్నారు. అక్రమ వలసలను అరికట్టడానికి మెక్సికో గోడ కట్టడం అన్నది అత్యంత కీలకమని ఇమ్మిగ్రేషన్ అధికారులే చెప్పిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే ప్రభుత్వాన్నే మూసేస్తానని, ఆ విధంగా దీనికి ఆమోదం తెచ్చుకోవడంతో పాటు నిధులనూ తెచ్చుకుంటానని అన్నారు. అరిజోనా రాష్ట్రంలోని ఫినిక్స్ పట్టణంలో జరిగిన అమెరికా పునరుత్థాన ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ ప్రతి పక్ష డెమోక్రాట్లు వ్యవహరిస్తున్న తీరుని ప్రతిబంధక ధోరణిగా అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వలసలను అడ్డుకోవడానికి మెక్సికో గోడకడతా. కాని డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారు. ఇందుకోసం ఎలాంటి చర్యనైనా తీసుకోవడానికి నేను సిద్ధం. అవసరమైతే ప్రభుత్వాన్నే మూసేస్తా అని ట్రంప్ తెలిపారు.













