కొరియాతో యుద్ధం తప్పదేమో!
ఉత్తరకొరియాతో భారీ యుద్ధం తప్పకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయినా దౌత్య స్థాయిలోనే సమస్య పరిష్కారానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఇటీవల ఉత్తరకొరియా అణుక్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్ ఈవిధంగా స్పందించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి శనివారం నాటికి వందరోజులు కావస్తున్న సందర్భంగా ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమెరికా మాజీ అధ్యక్షులను సందిగ్ధంలో పడేసిన ఉత్తరకొరియా విషయంలో మేము శాంతియుతంగా వ్యవహరిస్తాం. అదేసమయంలో అక్కడినుంచి మా సైన్యాలను ఉపసంహరించే ప్రశ్నే లేదు. ఆ దేశంపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంపై ఆలోచిస్తున్నాం. దౌత్యపరంగానే సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాం. అయితే అది చాలా కష్టం. ప్రపంచంలో ఉత్తరకొరియానే మాకు అతిపెద్ద సవాలు అని ట్రంప్ పేర్కొన్నారు. ఉత్తరకొరియా సమస్య పరిష్కారానికి అమెరికాకు సహకరిస్తానన్న చైనా అధ్యక్షుడు జీ జింపింగ్పై ఆయన ప్రశంసలు జల్లు కురిపించారు. జింపింగ్కు కూడా హింస అంటే ఇష్టంలేదని, ఆయన మంచిమనిషని ట్రంప్ చెప్పారు.
అణుక్షిపణులు ప్రయోగించిన ఉత్తరకొరియాను ఏకాకిని చేయడంపై త్వరలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒత్తిడి చేస్తామని తెలిపారు. ప్రపంచానికి ఉత్తరకొరియా నుంచి ముప్పు ఉందని, ఆ దేశంపై ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడి తేవడానికి చైనా సహకారం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప మిలిటరీ దాడులు చేయబోమని పేర్కొన్నారు. దాడులు చేస్తే ఉత్తరకొరియా కూడా ప్రతిఘటించవచ్చని అన్నారు. యూఎస్ థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్మాణానికయ్యే బిలియన్ డాలర్ల వ్యయాన్ని దక్షిణకొరియా చెల్లించాలని అన్నారు.













