భారత్ ఐటి కంపెనీలకు ట్రంప్ షాక్
భారత్ ఐటి కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. అమెరికాలో ఉండే ఐటి కంపెనీలు విదేశాలకు ఔట్సోర్సింగ్ ఇవ్వడంపై సమీక్ష నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. తాము ఇచ్చిన కాంట్రాక్టులపై నివేదిక ఇవ్వాలని భారత కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో టీసీఎస్లకు అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. అమెరికాలో 3.5 శాతం కాంట్రాక్టులను భారత కంపెనీలే దక్కించుకున్నాయి. వీటి విలు వేల కోట్ల డాలర్లు ఉంటుంది. ఔట్ సోర్సింగ్ విధానాలనే కాకుండా హెచ్-1బీ వీసా లపై కూడా సమీక్షించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించడతో భారత ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ఔట్సోర్సింగ్లో కూడా ఆంక్షలు విధిస్తే భారత ఐటి కుప్పకూలుతుందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులను విదేశీ కంపెనీలకు ఇవ్వొద్దని ట్రంప్ చెబుతున్నారు. గతంలో ఒబామా సర్కారు హాయంలో భారత ఐటి కంపెనీలు చేజిక్కించుకున్న ప్రాజెక్టులను సమీక్షించేందుకు ప్రస్తుతం ట్రంప్ సిద్ధమయ్యారు. బై అమెరికన్, హైర్ అమెరికన్, అమెరికన్లకు ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ విదేశీ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా కంపెనీలకు, అమెరికన్లకు తన ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలతో భారత్లోని ఐటీ కంపెనీల్లో భవిష్యత్తు ప్రశ్నార్థకంగామారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








