పెంపుడు జంతువులతో మాట్లాడొచ్చు!
మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా? అయితే, ఈ వార్త మీకు తప్పకుండా ఆనందం కలిగిస్తుంది. జంతువుల భాషను అర్థం చేసుకొని, వాటితో మాట్లాడటానికి వీలు కల్పించే అనువాద పరికరం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించే ప్రయరీ శునకాలపై ఓ ప్రత్యేక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాఫ్ట్వేర్ సాయంతో ఆమెరికా పరిశోధకులు ఇటీవల పరిశోధనలు నిర్వహించారు. సాధారణ భాషలాగే అన్ని అంశాలున్న భావప్రకటన వ్వవస్థ సాయంతో అవి పరస్పరం సమాచారాన్ని చేరవేసుకుంటున్నట్లు గుర్తించి, దాన్ని సమర్థంగా విశ్లేషించారు. ఇతర జంతువు ల్లోనూ ఇలాంటి విలక్షణ భాషావ్వవస్థ ఉంటుందని పేర్కొన్నారు. వాటి భాషలను విశ్లేషించగల సాఫ్ట్వేర్ అభివృద్ధి పెద్ద కష్టమేమీ కాబోదన్నారు. పదేళ్లలో ఈ అనువాద పరికరం అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలిపారు. దాని సాయంతో మనుషులు పెంపుడు జంతువులతో మాట్లాడవచ్చునని సూచించారు.













