‘హార్వీ’ కష్టాలు
హార్వీ హరికేన్ ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తోడు భారీ వరదలు టెక్సాస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా టెక్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్లో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్లో తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
సహాయక చర్యలకు బోట్లు అవసరం కావడంతో, విద్యార్థులకు బోట్ల ద్వారా ఆహారం అందించాలన్న తమ ప్రతిపాదనను అమెరికా తీరరక్షక దళం తిరస్కరించిందన్నారు. మరోవైపు స్థానిక అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. హార్వే కారణంగా లూసియానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 60 లక్షల మంది హార్వే కారణంగా ఇబ్బంది పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఫోర్ట్ బెండ్ కౌంటీలో 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి.








