ఆద్యంతం అద్భుతం! షడ్రుచులతో స్వాగతం!!
ఆనంద రత్నాకరం
హేవళంబి ఆగమం!
హృద్యమం నూతనం
తెలుగువారి స్వాగతం!!
సుఖాలకి పొంగిపోకూడదు, దుఃఖాలకి కుంగిపోకూడదు అనే సమ భావాన్ని చాటి చెప్పే పండుగ ఉగాది. మెంఫిస్ తెలుగు వారికిఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాల్ని మది తలపుల్లో శాశ్వతంగా మిగిల్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన శ్రీ హేవళంబి నామ సంవత్సరానికి షడ్రుచులతో ఘన స్వాగతం పలికింది మెంఫిస్ తెలుగు సమితి. తెలుగు అసోసియేషన్ అఫ్ మెంఫిస్ ఏప్రిల్ 8న (శనివారం)సౌత్ విండ్ హై స్కూల్లో నూతన సంవత్సర వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది.
పులుపు, చేదు, వగరు, తీపి, ఉప్పు మరియు కారం ఇలా షడ్రుచులతో సమ్మిళితమయిన ఉగాది పచ్చడిని అతిధులకు తినిపించడమే కాదు అంగరంగ వైభవంగా అలంకరించిన సౌత్ విండ్ హై స్కూల్ ప్రాంగణం మరియు వేదిక మీద అద్భుతమయిన సాంస్కృతిక కార్యక్రమాలు హృద్యమంగాప్రదర్శించారు. టేనస్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీ రెప్రెసెంటేటివ్ మార్క్ వైట్ ముఖ్య అతిధిగా విచ్చేసి మెంఫిస్ మహానగరంలో తెలుగు వారు, ప్రవాసభారతీయులు చేస్తున్న కృషిని ఎంతగానో కొనియాడారు.
వసంత రుతువులో తెలుగునాటే కాదు మెంఫిస్ లోను చెట్లు చిగురిస్తాయి, పూలమొక్కలు రంగుల హరి విల్లులే అవుతాయి. కోకిల గానాలకుకొదవుండదు, విరగ కాసిన మామిడి పల్లె కాంతకి కొత్త అందాల్ని అద్దితే, పచ్చటి పైర్లు ముచ్చట గొలుపుతాయి.
వయస్సుతో నిమ్మితం లేకుండా చిన్న పెద్ద అందరు సందడి చేసారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రమం తప్పకుండ ప్రదర్శించే సినిమాపాటలకినృత్యాలు, జానపద, సంప్రదాయ నృత్యాలు, గీతాలాపనలు, ఫాషన్ షోలు ఇలా శనివారం సాయంత్రం 4 నుండి 8 వరకు జరిగిన సాంస్కృతిక ప్రదర్శనఅద్భుతమయిన విందు భోజనంతో ముగిసింది. గారెలు, బూరెలు, ఆవకాయ, కంది పొడి, పులిహార, దద్దోజనం ఇంకా ఇంకా అనేక వంటకాలు,చివరగా తెలుగు వారికి ఇష్టమయిన తాంబూలం (కిల్లి)తో ముగిసింది.
మెంఫిస్ తెలుగు సమితి అధ్యక్షులు వాన రత్నాకర్ ఆధ్వర్యంలో గౌరి ససిపల్లి, అనిల్ బయన్న, అశ్విన్ అన్నపురెడ్డి, చిరంజీవి గొంప, ఉమా బెల్డ్,రాఘవేంద్ర ధనికుల, పావని పెనుగొండ, రామచందర్ గోలి, జనార్దన్ పగడాల, సురేంద్రనాథ్ మొక్కపాటి, రంగ కురేటి, సందీప్ చిట్టి, గౌతమ సంధ్యమట్టే, ఫణి తెంగలపల్లి, రాజా చెన్నం, కృష్ణ పెరి మరియు ప్రశాంతి నక్క కార్యవర్గ సమిష్టి సహకారంతో ఉగాది వేడుకని మెంఫిస్ వాసులు మరోసారిఅద్భుతంగా జరుపుకున్నారు.













