సెయింట్ లూయిస్‌లో కొనసాగుతున్న నిరసనలు
సెయింట్ లూయిస్ ఘటనపై ఒకపక్క నిరసనలు కొనసాగుతుండగానే మరోపక్క గత శుక్రవారం నుండి అమెరికా వ్యాప్తంగా పోలీసులు మరో ఎనిమిదిమందిని కాల్చి చంపారు. వర్జీనియాలో, లాస్ఏంజెల్స్ సమీపంలో లూసియానాలో ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. సెయింట్ లూయిస్‌లో వరుసగా నాల్గవ రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. సెయింట్ లూయిస్‌లోని జస్టిస్ సెంటర్‌కు వెలుపల గుమిగూడిన వేలాదిమంది ఆందోళనకారులు ఆదివారం రాత్రి అరెస్టయిన 123 మందికి మద్దతుగా నినాదాలు చేశారు. మా వాళ్లను వదిలిపెట్టండి అంటూ వారు గట్టిగా నినదించారు. గుమిగూడకుండా అక్కడ నుండి వెళ్లాలంటూ పోలీసులు జారీ చేసిన ఆదేశాలు ఉల్లంఘించిన వీరిని అరెస్టు చేశారు. 2011లో ఆఫ్రికన్ అమెరికన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో శ్వేత జాతీయుడైన పోలీసు అధికారిని నిర్దోషిగా విడిచిపెట్టడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.













