ప్రెగ్నెంట్ అని పొరపాటున చెప్పేశా..
తాను గర్భవతినన్న విషయం పొరపాటుగా చెప్పేశానంటోంది అమెరికా టెన్నిస్ తారా సెరెనా విలియమ్స్. ఇటీవల తాను 20 వారాల గర్భవతిని స్నాప్‌చాట్ ద్వారా వెల్లడించిన సెరెనా వాన్కూవెర్లో నిర్వహించిన టెడ్ కాన్ఫరెన్స్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నేనెప్పుడూ స్టేటస్లు, ఫొటోలు చూసుకుంటూ ఉంటా. వాటని నా జ్ఞాపకార్థాలుగా పోస్ట్ చేస్తుంటా. ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతుండేదాన్ని. కానీ ఈ సారి మాత్రం మిస్సయ్యా. ఇలాంటి విషయాలు ఒక్కసారి బయటికి వచ్చాయంటే ఇక ఏవేవో కథలు అల్లేస్తుంటారు. కాబట్టి ఇక చేసేదేంలేక ప్రెగ్నెన్సీ గురించి చెప్పేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ ఆడుతున్నపుడు నేను గర్భవతినా కాదా అన్న విషయం ఆలోచించలేదు. ఆ టోర్నమెంట్ గెలవాలన్న ఆలోచన ఒక్కటే ఉండేది. నేను అడుతున్న ప్రతీసారీ గెలవాలనుకుంటాను. ఒకవేళ గెలవకపోతే అదే నాకు అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఈ అమ్మతనం అనేది జీవితంలో ఓ భాగమే. నాకు బేబీ పుట్టాక కూడా ఆడతాను. నా బేబీ స్టాండ్‌లో నిలబడి నా ప్రదర్శనను చూస్తూ చప్పట్లు కొట్టాలి అని చెప్పికొచ్చింది సరెనా.













