కొత్త టెక్నాలజీలు మానవత్వాన్ని మంటగలిపేలా ఉండొద్దు
కొంగొత్త టెక్నాలజీలనేవి మనుషులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ఉండాలే తప్ప మానవత్వాన్ని మంటగలిపేవిగా ఉండకూడదని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. అమెరికా ఓర్లాండోలో 25వేల మంది సాంకేతిక రంగ నిపుణులు, విశ్లేషకులు పాల్గొన్న మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ సదస్సులో ప్రసంగించారు. ఉత్పాదకత, సమర్థతను మెరుగుపర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ఈ క్రమంలో మానవతా విలువలు పతనం కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉత్పాదకత పెంచుకునే పేరిట గతంలో ఎన్నడూ లేనంతగా డిజిటల్ జపం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం ప్రతి ఒక్క పరిశ్రమపై దీని ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు.








