న్యూజెర్సీలో సాయి పాదుక యాత్ర
అమెరికాలోని షిరిడీ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం.. తన లక్ష్య సాధనంలో కీలకమైన ఓ ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు సాయి దత్త పీఠం స్థల సేవ పేరుతో అమెరికాలో న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర, 43 రాష్ట్రాలలోని వివిధ నగరాల్లో కొనసాగిం చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు భక్త జనం నెరాజనాలు పట్టారు. ఐదు మైళ్ల పాటు జరిగిన ఈ ముగింపు యాత్రలో 100 పైగా కార్లతో భక్తులు పాల్గొన్నారు. తొలుత న్యూజెర్సీలోని మేడిచర్ల మురళీ కృష్ణ నివాసంలో సాయి పాదుక పూజ నిర్వహించారు.
అనంతరం పల్లకీ దాత కనికిచెలర్ల లీలా కృష్ణ నివాసంలో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడ నుంచి ప్రారంభమైన యాత్రకు సాయి నామ జపంతో భక్త జనం జేజేలు పలికారు. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా దీనికి తమ వంతు సహకారం అందించింది. సాయి దత్త పీఠం సభ్యులు, సాయిభక్తులు వందలాది మంది ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. షిరిడీ సాయి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి, అమెరికాలో షిరిడీ లక్ష్యాన్ని వివరించింది. సాయి దత్త పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండు సంవత్సరాల పాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75000 మైళ్ల దూరం ఈ సాయి పాదుకయాత్ర సాగింది. సాయి దత్త పీఠం సిద్ధం చేసిన సాయి రథం ద్వారా ఈ పాదుక యాత్ర 43 రాష్ట్రాల్లో దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయి పాదుక పూజ చేసింది. 150కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది. వందకు పైగా సమన్వయకర్తలు.. 500 మందికి పైగా స్వచ్ఛంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయి భక్తులను పలకరించింది. ప్రతి రాష్ట్రంలో సాయి దత్త పీఠం చేపట్టిన ఈ పాదుకయాత్రకు భక్తులు నీరాజనం పట్టారు.








