తేనీరు, రెడ్ వైన్‌తో జలుబు మాయం!
జలుబును అడ్డుకోవడంలో తేనీరు (టీ), రెడ్ వైన్ చక్కగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. వీటిలో లభించే ఓ సమ్మేళనం రోగ నిరోధక శక్తి మెరుగుకు తోడ్పడుతుందని వెలుగులోకి వచ్చింది. ఎలుక పిల్లలపై అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. తేయాకు, రెడ్ వైన్, నేరేడు పండ్లలో కనిపించే ఫ్లేవనాయిడ్లపై వారు దృష్టి కేంద్రీకరించారు. వీటిని కడుపులోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయడంతో వెలువడే పదార్థాలు, జలుబు లక్షణాలను తగ్గిస్తున్నట్లు కనిపెట్టారు. ఫ్లేవనాయిడ్లకు ఔషధ గుణాలున్నాయని ఎప్పుడో బయటపడింది. అయితే ఇవి మన కడుపులోని బ్యాక్టీరియాతో కలిసినప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతోందని తాజాగా మేం గుర్తించా అని పరిశోధకులు థాడ్డెస్ సెప్పాన్బెక్ తెలిపారు. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడూ ఫ్లేవనాయిడ్లు చక్కని ఫలితాలనిస్తున్నాయని వివరించారు.













