ఏపీలో అణు రియాక్టర్లను నిర్మిస్తాం : అమెరికా
వాణిజ్య పౌర అణు ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి భారత్, అమెరికాలు కట్టుబడి ఉన్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఇంధన రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య భేటీ అనంతరం శ్వేతసౌధం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ మేరకు పేర్కొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరు వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ ఏపీ-100 అణు రియాక్టర్ల నిర్మాణానికి కట్టుబడినట్లు వివరించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల మంది భారతదేశ పౌరులకు విశ్వసనీయ స్థాయిలో విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపింది. అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్ సంస్థకు, భారత్‌కు చెందిన అణు విద్యుత్ కార్పొరేషన్‌కు మధ్య కాంట్రాక్టు ఒప్పందాలను ఖరారు చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఇద్దరు నేతల భేటీ అనంతరం వెలువడిన ఉమ్మడి ప్రకటన పేర్కొంది.








