డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఉన్న ఒబామా హెల్త్‌కేర్ పాలసీ స్థానంలో కొత్త హెల్త్‌కేర్ పాలసీని ట్రంప్ ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాలసీకి సంబంధించి ఓటింగ్‌ను వాయిదా వేశారు. ఈ పాలసీకి ట్రంప్ యంత్రాంగం తగినంత మద్దతును కూడగట్టలేకపోవడంతో దీనిని వాయిదా వేయాల్సివచ్చింది. గత రాత్రి ఓటింగ్ జరగాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు లేకపోవడంతో స్పీకర్ ఈ అంశాన్ని నేటికి వాయిదా వేశారు. ఈ రోజు కూడా సభ్యులు లేని పక్షంలో నేడు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ రిపబ్లికన్ సభ్యులకు అల్టిమేటం ఇచ్చారు. హేల్త్‌కేర్ పాలసీ మార్పునకు సంబంధించి ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ బడ్జెట్ డైరెక్టర్ మిక్ ముల్వానే వెల్లడించారు. ఒకవేళ కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదించకపోతే ట్రంప్ ఇతర మార్గాల్లో వెళ్తారని ఆయన హెచ్చరించారు. ఒబామా కేర్ పాలసీ స్థానంలో వేరే పథకం ప్రవేశపెట్టేందుకు రిపబ్లికన్లంతా మద్దతివ్వాలని ట్రంప్ రిపబ్లికన్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై వెల్లడించారు. లేదంటే చట్టం తీసుకొస్తానని చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని వైట్‌హౌస్ తెలిపింది.







