ఐన్‌స్టీన్ అరుదైన చిత్రం వేలం
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్‌కు చెందిన అరుదైన చిత్రాన్ని అమెరికా సంస్థ నేట్ డీ శాండెర్స్ వేలం వేయనుంది. ఈ చిత్రాన్ని 1951 మార్చి 14న ఐన్‌స్టీన్ 72వ పుట్టినరోజు సమయంలో తీశారు. దీనిలో ఆయన నాలుకను బయటపెట్టి సరదాగా కనిపిస్తారు. చెక్కుచెదరని ఈ చిత్రం వేలంలో రూ.64.36 లక్షలు (లక్ష డాలర్లు) వరకు ధర పలుకుందని అంచనా. దీన్ని అప్పట్లో ప్రచురించేందుకు ముద్రణకర్తలు కాస్త తటపటాయించారు. అయితే మొదటిసారిగా ప్రచురించినప్పుడు ఐన్‌స్టీన్ చాలా సంతోషపడ్డారట. అంతేకాదు కొన్ని చిత్రాలను తన అత్యంత సన్నిహితులకు పంపాలని కూడా కోరారట. తాజా చిత్రంపై ఎలాంటి కత్తిరింపులూ పడలేదు. దీనిలో ఆయన పక్కన ఆనాటి ప్రిన్సెటన్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్స్టిట్యూట్ అధిపతి ఫ్రాంక్ ఎడిలోట్, ఎడిలోట్ సతీమణి కనిపిస్తున్నారు. చిత్రం ఎడమవైపు భాగంలో ఎన్‌స్టీన్ సంతకం చేయడం విశేషం.













