ఔషధ మొక్కలో హెచ్ఐవీ మందు!
ఆసియాలో కీళ్లవాతానికి వినియోగించే ఓ ఔషధ మొక్కలోని పదార్థం హెచ్ఐవీ చికిత్సకు మెరుగ్గా పనిచేస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్నుంచి మందు తయారు చేయగలిగితే, హెచ్ఐవీ/ ఎయిడ్స్ చికిత్సకు గాను యాంటీ రిట్రోవైరల్ వైద్య విధానంలో వినియోగించే అజిడొథామిడిన్ (ఏజెడ్టీ) కంటే శక్తిమంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఆయా మొక్కల్లోని ఆకులు, కాండాలు, వేర్ల నుంచి లభించే పేటెంటిఫ్లోరిన్ ఏ అనే పదార్థం హెచ్ఐవీపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. పదేళ్ల క్రితం హనోయి (వియాత్నాం) లోని కక్ ఫోంగ్ నేషనల్ పార్క్ నుంచి ఈ మొక్కలను షికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డొయెల్ సొయెజర్టో సేకరించారు. అనంతరం హెచ్ఐవీ, క్షయ, మలేరియా, క్యాన్సర్లకు మందులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ మొక్కల నుంచి పరిశోధనశాలల్లో మందులు తయారు చేయగలిగితే వాటిని పెంచడానికి క్షేత్రాలను ఏర్పాటు చేయాల్సి అవసరం కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.













