సదరన్ కాలిఫోర్నియాలో ఘనంగా ‘పాఠశాల’ వసంతోత్సవం
అమెరికాలో వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు చిన్నారులకోసం ఏర్పాటు చేసిన ‘పాఠశాల’ కేంద్రాలు 2016-17 విద్యాసంవత్సరంను విజయవంతంగా నిర్వహించడంతోపాటు వివిధ చోట్ల పాఠశాల వసంతోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాల విద్యార్థుల భాషా పటిమను తెలియజేయడంతోపాటు, వారి కళానైపుణ్యాలను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా సదరన్ కాలిఫోర్నియాలోని పాఠశాల కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన వసంతోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి. ఇర్వైన్లోని లేక్ వ్యూ సీనియర్ సెంటర్లో ఏప్రిల్ 1వ తేదీన జరిగిన ఈ వేడుకలకు చిన్నారులతోపాటు తల్లితండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల ఏరియా డైరెక్టర్ శ్రీధర్ సాతులూరి అందరినీ ఆహ్వానించి ప్రసంగించారు. తెలుగు భాషను సులభంగా విద్యార్థులకు ఎలా నేర్పుతున్నామో వివరించారు. వినోద్ బూరుగుపల్లి, సూర్య ప్రకాష్ భమిడిపాటి, నవీన్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఇర్విన్ కేంద్రంలోని టీచర్లు సుందీప్త ఆచంట, శారద అమిర్నేని, శిరీష అల్లాని, మాధవిలత చుందూరు, రూపేష్ నర్రా, లేక్ఫారెస్ట్ కేంద్రంలలోని టీచర్లు వాణి కందిపాటి, రాజేష్ దొడ్డలపూడి, సురేష్ కోటపాటి (లేక్ఫారెస్ట్ కో ఆర్డినేటర్) తదితరులు విద్యార్థుల భాషా నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. హర్ష, శ్రీహరి, మహేష్ తదితరులు విద్యార్థుల సాంస్కృతిక కళా నైపుణ్యాన్ని ఫోటోలలో ఇనుమడింపజేశారు.













