ఒబామాకేర్ మారితే వ్యాపారానికి ముప్పు: రెడ్డీస్
ఒబామాకేర్ స్థానంలో మరో చట్టం వస్తే యూఎస్ మార్కెట్లో తమ వ్యాపారానికి ముప్పు వాటిల్లుతుందని ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఒబామాకేర్గా ప్రాచుర్యంలో ఉన్న పేషెంట్ ప్రొటెక్షన్, అఫర్డబుల్ కేర్ యాక్ట్ (పీపీఏసీఏ) స్థానంలో కొత్త చట్టం అమెరికా హెల్త్ కేర్ యాక్ట్ తేవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి 2017లో ఈ మేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ ఈ యాక్ట్‌ను పాస్ చేశారు. ప్రస్తుతం ఈ చట్టం యూఎస్ సెనేట్ వద్ద పెండింగులో ఉంది. పీపీఏసీఏతో పాటు ఔషధాల ధర, ఆరోగ్య బీమాతో ముడిపడి ఉన్న చట్టాల్లో మార్పుతో కంపెనీ కార్యకలాపాలు, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూఎస్ సెక్యురిటీస్, ఎక్స్చేంజ్ కమిషనకు రెడ్డీస్ తెలిపింది. భారత్‌లోని తయారీ కేంద్రాలపై యూఎస్ఎఫ్డీఏతోపాటు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన నియంత్రణ సంస్థల తనిఖీలు ఇటీవల కాలంలో పెరిగాయి. అత్యుత్తమ విధానాలు, నాణ్యత ప్రమాణాలు పాటించినా వార్నింగ్ లెటర్లు, ఇంపోర్ట్ బ్యాన్స్ నుంచి రక్షణకు హామీ లేదని వ్యాఖ్యానించింది.








