సునయనకు వర్క్ వీసా!
అమెరికాలో ఉన్మాది కాల్పులకు బలైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య దుమాల సునయనకు తాత్కాలిక వర్క్ వీసా మంజూరైంది. భర్త మరణంతో యూఎస్‌లో నివసించే హక్కును కోల్పోయిన అమెకు అక్కడి చట్ట సభ సభ్యుడు ఒకరు అండగా నిలిచి సాహాయం చేశారు. ఆడమ్ పూరింటన్ అనే ఉన్మాది జరిపిన కాల్పులో శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. హెచ్1బీ వీసాదారు అయిన జీవిత భాగస్వామి మరణంతో హెచ్4 వీసా పై ఉంటున్న సునయన దేశంలో ఉండే అవకాశాన్ని కోల్పోయారు.
శ్రీనివాస్ అంత్యక్రియల కోసం భారత్‌కు వచ్చిన అమె మళ్లీ యూఎస్ వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. అయితే అమెకు జరిగిన అన్యాయంపై అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (చట్టసభ) సభ్యుడు కెవిన్ యోడర్ స్పందించారు. భర్త పోయిన బాధలో ఉన్న ఆమెకు దేశంలో నివసించే హక్కును కూడా రద్దు చేయడం తనకు చాలా అవమానకరంగా అనిపించిందన్నారు. ప్రస్తుతానికి అమెకు తాత్కాలిక వర్క్ వీసా మంజూరైందని, దీనికి శాశ్వత పరిష్కారం సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా తనకు వర్క్ వీసా వచ్చేందుకు కృషి చేసిన యోడర్కు సునయన కృతజ్ఞతలు తెలిపారు.








