అమెరికాలో మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ప్రవాసులు విస్తృత ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు వాషింగ్టన్ నగరానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కనీవినీ ఎరుగనంత భారీ స్థాయిలో ఘనస్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మోడీ గత ఏడాది అమెరికాలో పర్యటించినప్పుడు న్యూయార్క్ / న్యూజెర్సీ లేదా సిలికాన్ వ్యాలీలో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం విదితమే. ఈ రెండు ప్రాంతాల్లో
ఉన్నంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్లో ఉండకపోవచ్చు. కానీ అక్కడి ప్రవాస భారతీయుల్లో మోదీ పట్ల ఉత్సాహం మాత్రం అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ మూడు రోజుల పాటు పర్యటించబోతున్న మోదీకి సాధ్యమైన ప్రతిచోటా ఘనస్వాగతం పలకాలని ప్రవాస భారతీయులు యోచిస్తున్నారని, మోదీ రాక కోసం వీరంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని అమెరికాలో బిజెపి మిత్ర బృంద నాయకుడు అడపా ప్రసాద్ తెలిపారు.








