భార్య కోసం గ్రీన్‌కార్డు త్యాగం చేశా
కట్టుకున్న భార్య కోసం తాను అమెరికా గ్రీన్‌కార్డుతో పాటు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థను కూడా వదులుకొనేందుకు సిద్ధపడ్డట్టు ఆ సంస్థ సిఇఒ ప్రవాస భారతీయుడు సత్యా నాదెళ్ల వెల్లడించారు. నాదెళ్లకు 1993లో అనూతో వివాహమైంది. వివాహానంతరం ఆయన అనూను తనతో పాటు అమెరికాకు తీసుకుపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కానీ అమెరికాలో ఉన్న వీసా నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డు హోల్డర్‌ను వివాహం చేసుకుంటే సదరు వ్యక్తి హెచ్1బి వీసాకు కొత పడుతుంది. ఈ నిబంధన కారణంగా అనూ అమెరికాకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామం పట్ల ఎంతో కలత చెందిన నాదెళ్ల తన భార్య అనూ కోసం గ్రీన్‌కార్డుతో పాటుగా తాను పని చేస్తున్న సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్నాడట ఈ విషయాన్ని ఆయన తాజాగా విడుదలైన తన హిట్ రీఫ్రెష్ పుస్తకంలో పేర్కొన్నారు. కంపెనీలో ఎవరికి వీసా సమస్యలు వచ్చిన వారు తన వద్దకు వచ్చి సలహాలు తీసుకోవడం మొదలు పెట్టారని ఆయన అన్నారు. తన తండ్రి ప్రోద్భలంతోనే తాను విదేశాల్లో ఉద్యోగాల వైపు దృష్టి సారించానని తెలిపారు. ఇంజినీరింగ్ చేయడం ఉద్యోగాల నిమిత్తం పాశ్చాత్యానికి తరలడం వల్ల తన కోరికలు నెరవేరకుండానే పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పాఠశాల నుంచి ఎంతో మంది ప్రముఖులుగా ఎదిగారని ఆయన వారి పేర్లను తన పుస్తకంలో ప్రస్థావించారు.








