ఒంటరితనం సమాజానికి దూరం
ఒంటరితనం అనుభవిస్తున్న వ్యక్తుల్లో స్వార్థం పెరుగుతుందని, తిరిగి వారు ఆ స్వార్థం కారణంగా సమాజానికి మరింత దూరమవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఒంటిరితనం బాధితులు ఓ విషవలయంలో చిక్కుకుని ఉండిపోతున్నారని వారు పేర్కొంటున్నారు. తాము జరిపిన అధ్యయనంలో ఈ మేరకు ఫలితాలను గుర్తించినట్లు అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. భిన్న నేపథ్యాలకు చెందిన, 50 నుంచి 68 ఏళ్ల మధ్య వయస్కులో ఉన్న 299 వ్యక్తులపై అధ్యయనం జరిపినట్లు పేర్కొన్నారు. స్వార్థాన్ని నిర్మూలించే చర్యలు తీసుకుంటే, ఒంటిరితన ప్రభావాన్ని కూడా తగ్గించేందుకు అవకాశాలుంటాయని చెప్పారు. ఆరంభంలోని పరిశోధనలో ఒంటరితనాన్ని, తీరని బాధ వల్ల కలిగే ఓ తాత్కాలిక సమస్యగా మాత్రమే భావించారని పేర్కొన్నారు. జీవపరిణామం వల్ల కొన్ని భావనలు, ఆలోచనలు, వైఖరులవైపు మొగ్గు చూపేలా మెదడు మారినట్లు 2006లో శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని వివరించారు.













