కాల్పులతో దద్దరిల్లిన యుఎస్ నైట్ క్లబ్
అమెరికా మరోమారు కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ లోని ఓ ఆసుప్రతిలో కాల్పులతో విరుచుకుపడిన ఘటనను మరవకుండానే, ఓ నైట్ క్లబ్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. లిటిల్ రాక్‌లోని ఓ నైట్ క్లబ్లో వ్యక్తి తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా 17 మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరుగుతున్న వేళ, బయటకు వెళ్లేందుకు ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ ఘటనలోనే అత్యధికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. నిందితుడు పారిపోయాడా అన్న విషయమై సృష్టత లేదు.








