ఫ్లోరిడా భారతీయ అమెరికన్లకు సహాయ పునరావాస కార్య క్రమాలు
ఇర్మా మళ్లీ ప్రచండంగా మారడంతో ఫ్లోరిడా వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,20,000 మంది భారతీయ అమెరికన్లు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు నానా పాట్లు పడ్డారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేసే విధంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. సీనియర్ అధికారులను హుటాహుటీన అట్లాంటాకు పంపింది. వీరి ఆధ్వర్యంలో భారతీయ అమెరికన్లకు సహాయ పునరావాస కార్య క్రమాలు చేపట్టారు. భారత రాయబారి నవతేజ్ సర్న అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి అట్లాంటాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో ఉండి తక్షణ సహాయ సహకారాలు అందే విధంగా చూస్తున్నారు. కింగ్స్టన్లోని భారత్ హైకమిషన్ కార్యాలయంలో కూడా 24/7 హెల్ప్‌లైన్ ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ ద్వారా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఈమెయిల్ ఐడీలను ఆయన తెలియజేశారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, గుజరాత్ సమాజ్ అట్లాంటా, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా మూడు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశాయి. పలువురు ప్రవాస భారతీయ వ్యాపారులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు.













