అమెరికాలో అసహనం…
డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో అసహన భావాలు పెరిగిపోయాయి. స్థానిక బెనింగ్టన్ పాఠశాలలో 8 ఏండ్ల ముస్లిం చిన్నారి ముఖానికి ఉన్న హిజాబ్‌ను (ముఖానికి చుట్టుకునే వస్త్రం) తొలగించాలని ఓగెన్టెగా ఏడా(31) అనే ఉపాధ్యాయుడు ఆదేశించాడు. అయితే, దానికి ఆ చిన్నారి అంగీకరించలేదు. దాంతో, అతను బలవంతంగా విద్యార్థి ముఖానికి ఉన్న హిజాబ్‌ను తొలగించాడు. ఈ క్రమంలో బాలిక కుడి కన్నుకు గాయమైంది. ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బాలిక తన అనుమతి లేకుండా టీచర్ కుర్చీలో కూర్చుంది. బాలికను కుర్చీ నుంచి కిందికి దిగమని ఎంతగా వారించినా పట్టించుకోలేదు. హిజాబ్ తొలగించాలని హెచ్చరించానే తప్ప నేను తొలగించలేదు అని ఉపాధ్యాయుడు వివరణ ఇచ్చాడు. అయితే, అసహన భావాలు ప్రదర్శించిన ఏడాను విధుల నుంచి తప్పించినట్టు పాఠశాల యాజమాన్యం పేర్కొంది.













