గ్రీన్‌కార్డు నిరీక్షణ 12 ఏళ్లు!
అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ ఉద్యోగ నిపుణులు, వారు ఆశించే గ్రీన్‌కార్డు పొందాలంటే 12 ఏళ్ల వరకూ నిరీక్షించాల్సిందే. ఇంతకాలం పాటు వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ ఏటా గ్రీన్ కార్డు పొందే విదేశీయుల్లో భారతీయులు అధిక సంఖ్యలోనే ఉంటున్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రస్తుతం 2005లో గ్రీన్‌కార్డు కోసం భారతీయ ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని పీఈడబ్ల్యు రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 2010-14 ఆర్థిక సంవత్సరాల్లో ఉద్యోగ సంబంధిత హెచ్-1బి వీసాలు పొందిన వారిలో 2,22,000 (36శాతం) మందికి పైగా గ్రీన్‌కార్డులు మంజూరయ్యాయి. 2015లో 36,318 మంది భారతీయులు శాశ్వత నివాస హోదాకు మారారు. మరో 27,799 మంది గ్రీన్ కార్డు రూపంలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందారని ఆ సంస్థ పేర్కొంది.
అమెరికాలో శాశ్వత నివాసం పొందటానికి, ఉద్యోగం చేసుకోవటానికి అవసరమైన అధికారిక హోదాను వలస వచ్చిన వ్యక్తులకు గ్రీన్‌కార్డు కల్పిస్తుంది. గ్రీన్‌కార్డు పొందిన అయిదు ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికన్ పౌరులను వివాహమాడితే మూడేళ్లలోనే పౌరసత్వం పొందే వీలుంది.








