అమెరికా విమాన ప్రమాదంలో మచిలీపట్నం దంపతుల దుర్మరణం
అమెరికా వాషింగ్టన్ కౌంటీలో ఈ నెల 8న జరిగిన విమాన ప్రమాదంలో మచిలీపట్నంలో జన్మించిన కల్పాటపు ఉమామహేశ్వర్(63) దంపతులు మృతి చెందారు. 40 ఏళ్ల కిందటే ఇండియానాలో స్థిరపడిన ఉమామహేశ్వర్ అక్కడే రాజ్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. చార్టెడ్ విమానాన్ని స్వయంగా నడిపిన ఉమామహేశ్వర్ ఇండియానా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా విమాన ప్రమాద దుర్ఘటన జరిగింది. ఆయనతో పాటు విమానంలో ఆయన భార్య సీతాగీత రాజ్యలక్ష్మి ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం పదిన్నరకు ప్రమాదం జరిగింది. వీరి మరణ వార్త మచిలీపట్నంలోని వారి పరిచయస్థుల్లో విషాదాన్ని నింపింది.
ఉమామహేశ్వర్ మచిలీపట్నానికి చెందిన న్యాయవాది అప్పారావు కుమారుడు. ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నారు. గుంటూరులో వైద్యవిద్యను అభ్యసించారు. తనతోపాటు ఎంబీబీఎస్ చదువుకున్న గుంటూరుకు చెందిన రాజ్యలక్ష్మి ని వివాహం చేసుకున్నాక ఇండియానాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజ్యలక్ష్మిది సంగీత విద్యాంసుల కటుంబం. తెలుగు సినీ సంగీత దర్శకులతో కూడా వీరికి పరిచయాలున్నాయి. ఉమామహేశ్వర్ సోదరుడు వెంకటేశ్వరరావు పట్టణంలోని ఆంధ్ర జాతీయ కళాశాల అధ్యాపకుడిగా సేవలందించేవారు. ఉమామహేశ్వర్ కుటుంబసభ్యులు పట్టణంలో ప్రస్తుతం ఎవరూ లేరు. మచిలీపటాన్నికి చెందిన వైద్యురాలు ప్రతిభాభారతి, ఉమామహేశ్వర్ స్నేహితులు.








