హెచ్1బీ వీసాలకు భారతీయులు వెనకడుగు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది నెలలుగా చేస్తున్న ప్రతిపాదనలు, తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయ ఉద్యోగులు, అక్కడ చదువుతున్న మన విద్యార్థులు కలలు కరిగిపోతున్నాయి. హెచ్1బీ వీసాలకు దరఖాస్తులు ఈసారి ఏకంగా 16 శాతం పడిపోయాయి. అందులో గరిష్ఠంగా భారతీయులవేనని నిపుణులు సృష్టం చేస్తున్నారు. ట్రంప్వి ఇప్పటి వరకు ప్రతిపాదనలే అయినా ఆయన చర్యలను గమనిస్తున్న భారతీయులు దరఖాస్తు చేసుకోవడానికి కొంత వెనకడుగు వేసినట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ వచ్చిందంటే భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అమెరికాలో చదువుతునన మన విద్యార్థుల ఆలోచనలన్నీ హెచ్1బీ వీసా చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రతి ఏటా అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు 85 వేల హెచ్1బీ వీసాలను అక్కడి ప్రభుత్వం జారీ చేస్తుంది. అందులో 20 వేలు అక్కడ మాస్టర్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా వాటిని ప్రపంచవ్యాప్తంగా నిపుణులకు జారీ చేస్తారు. ఇందుకోసం అమెరికా పౌరసత్య, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ఈసారీ ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరంలో 2.36 లక్షల మంది హెచ్1బీ కోసం దరఖాస్తు చేసుకోగా, 2018కి ఆ సంఖ్య 37వేలు తగ్గి 1.99 లక్షలకు పడిపోవడంతో 16శాతం తగ్గాయి. హెచ్1బీ కింద ఏడాదికి కనీసం వేతనం 1.30 లక్షల డాలర్లు ఉండాలని ట్రంప్ బిల్లు ప్రవేశపెట్టడం, అమెరికన్లకే ప్రాధాన్యం తదితర ప్రతిపాదనల నేపథ్యంలో భారతీయులపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు.













