అమెరికాలో భారతీయుడి సాహసం…. చేదు అనుభవం
అమెరికాలో ఓ భారతీయుడికి వింత అనుభవం ఎదురైంది. ప్రమాదంలో ఉన్న మహిళను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు ఓ వ్యక్తి. అయితే ఓ వైపు ఆయన సాయం చేస్తుంటే, మరో వైపు ఆ వ్యక్తి వస్తువులను దుండగలు కాజేసిన సంఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే. భారత్‌కు చెందిన అనిల్ వన్నావలి పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అక్కడ ఓ కంపెనీలో డేటా ఆడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు. రోజులాగే గత శుక్రవారం అనిల్ మన్హట్లోని తన ఆఫీస్‌కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ రైలు కోసం ఎదురుచూస్తుండగా, మాధురి రేచెర్ల అనే మహిళ ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయింది. ఎదురుగా రైలు వస్తుండటంతో అనిల్ వెంటనే అప్రమత్తమై తన బ్యాగును ఫ్లాట్‌ఫాంపై పెట్టి రైల్వే ట్రాక్‌పైకి దూకారు. అతనితో పాటు మరో ప్రయాణికుడు కూడా దూకి, మాధురిని కాపాడు. అయితే తిరిగి ఫ్లాట్ఫాంపైకి వచ్చి చూసేసరికి ఆయన బ్యాకు కన్పించలేదు. అందులో అనిల్ లాప్టాప్, హెడ్‌ఫోన్స్, ఐడీకార్డు సహా 200 డాలర్ల నగదు కూడా ఉంది. అనిల్ సాయం చేయడానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు ఆయన బ్యాగును ఎత్తుకెళ్లారు. దీంతో అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను సాయం చేయడానికి వెళ్తే వాళ్లకి ఎలా చోరీ చేయాలన్పించిందని అనిల్ విచారణ వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజ్‌ల ద్వారా దుండగుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
అనిల్ కు నగదు పురస్కారం :
ప్రాణాలు లెక్కచేయకుండా సాటి మనిషి కోసం సహసం చేసిన అనిల్ ను అమెరికా పోలీసులు అభినందించారు. ఈ ఘటనలో తన బ్యాగ్ ను కోల్పోయిన అనిల్ కు నష్టపరిహారంగా వెయ్యి డాలర్ల చెక్కును అందించారు.








