దుస్తులను ఆరబెట్టడం ఇక మరింత సులభం!
ఉతికిన, తడిసిన దుస్తులను ఆరబెట్టడం ఇక మరింత సులభం కానుంది. బట్టలను ఆరబెట్టేందుకు ప్రస్తుతమున్న యంత్రాల (డ్రయ్యర్లు)తో పోలిస్తే, చాలా వేగంగా, సమర్థంగా పనిచేసే అత్యాధునిక డ్రయ్యర్‌ను భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త విరల్ పటేల్ తో కూడిన ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ పరిశోధకుల బృందం తాజాగా అభివృద్ధి చేసింది. అల్ట్రాసోనిక్ డ్రయ్యర్గా పిలుస్తున్న ఈ యంత్రం, ఉష్టంతో సంబంధం లేకుండానే బట్టలను ఆరబెడుతుంది. సంప్రదాయ డ్రయ్యర్లతో పోలిస్తే, ఇది కేవలం సగం సమయంలోనే దుస్తులను ఆరబెడుతుంది. 5 రెట్లు ఇంధన శక్తిని అధికంగా ఆదా చేస్తుంది. భాష్పీభవనం విధానంలో కాకుండా, యాంత్రిక శోషణ ప్రక్రియ ద్వారా ఇది బట్టల పోగుల నుంచి తేమను తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో ఉష్టం ఏమాత్రం అవసరముండదు. అల్ట్రాసోనిక్ డ్రయ్యర్లు విపణిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 2-5 ఏళ్లు పట్టే అవకాశముందని పటేల్ వెల్లడించారు.













