అమెరికాలో మరో విద్వేష ఉదంతం
అమెరికాలో మరో ఇండియన్ -అమెరికన్‌కు ఇటీవల విద్వేష ఘటన ఎదురైంది. ఇండియానాలోని ఒక సిక్కు డాక్టర్‌ను అజ్ఞాత వ్యక్తి ఫోన్లో చంపుతానని బెదిరిస్తున్నట్లు తెలిసింది. అమరదీప్ సింగ్ అనే ఇండియానాలోని మన్రో ఆసుపత్రి డాక్టర్‌కు మొబైల్లో అటువంటి బెదిరింపు వచ్చినట్లు కొందరు ఇండియన్- అమెరికన్లు తెలిపారు. ఆ నెంబర్ ఫోన్ మునుపటి స్వంతదారును తానే హత్య చేసినట్లు ఆ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు సందేశంలో తెలిపాడని కూడా వారు చెప్పారు. ఇండియన్ అమెరికన్లపై గురిపెట్టి సాగుతున్న వరుస విద్వేష ఘటనలలో ఇది తాజాది. తన 14 ఏళ్ల అమెరికా జీవితంంలో ఇలాంటి బెదిరింపు ఎన్నడూ చూడలేదని బాధితుడు అమరదీప్ తెలిపారు. చంపానని ఆ వ్యక్తి తెలిపిన మనిషి బ్రతికే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది జాతి ద్వేషంతో చేసిన బెదిరింపుగా కూడా పోలీసులు భావిస్తున్నారు.













