అమెరికా మహిళా క్రికెట్ జట్టులో హైదరాబాద్ యువతి
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండలం, ఆమన్‌గల్ గ్రామానికి చెందిన సింధూజ రెడ్డి అమెరికా మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ మహిళ జట్టు తరుపున గతంలో సింధూజ రెడ్డి రంజీ ట్రోఫీలో ఆడారు. అండర్ 19లో క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. అండర్ 19 భారత జట్టులో సభ్యురాలుగా పలు పోటీల్లో పాల్గొన్నారు. బి.టెక్, ఎం.బి.ఎ, చదివిన సింధూజరెడ్డి ఇటీవలే అమెరికాలో స్థిరపడిన సిద్దారెడ్డిని వివాహం చేసుకున్నారు. దీంతో అమేరికాలోనే స్థిరపడ్డారు. ఐసిసి ఇటీవలే అమెరికా క్రికెట్ జట్టును గర్తించింది. ఐసిసి టోర్నిలో ఆడే అమెరికా మహిళా క్రికెట్ జట్టును ఇటీవలే ఎంపిక చేయగా, అందులో సింధూజారెడ్డి ఎంపికయ్యారు. స్కాట్లాండ్లో జరిగే మహిళా వరల్డ్ కప్ క్యాలిఫయింగ్ మ్యాచ్ కోసం అమెరికా తరపున ఆమె పాల్గొంటారు. సింధూజరెడ్డి ఎంపిక పట్ల ఆమె తల్లిదండ్రులు గడ్డం సుదర్శన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై మక్కువ చూపించేదని, వివాహం తర్వాత కూడా అభిరుచిని వదులుకోకుండా సాధన చేసిందని వారు చెప్పారు. అమెరికా జట్టుకు వికెట్ కీపర్/బ్యాట్స్ మెన్ గా సేవలు అందించనున్నారు.








