అమెరికాకు మరో తుఫాను ముప్పు
హార్వే హరికేన్ బీభత్సం మరచిపోకముందే మరో తుపాను ఇర్మా మంచుకొస్తోంది. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లోని బార్బుడా ప్రాంతాన్ని ఇర్మా తాకింది. సెయింట్ మార్టిన్, సెయింట్ బార్తెల్మీలపై తీవ్రంగా ఇది విరుచుకుపడే అవకాశం ఉంది. అంట్లాటిక్ మహాసముద్రంలో అతి భారీ తుపానుగా దీన్ని పేర్కొంటున్నారు. 5వ ప్రమాద స్థాయి తీవ్రత గల హరికేన్ అయిన ఇర్మా కారణంగా గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తాయని, 200 నుండి 400 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బలమైన గాలలు, సముద్రంలో భారీ అలల ప్రభావానికి భూకంపం వచ్చే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫ్లోరిడా తీరాన్ని ఇది తాకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఫ్లోరిడా, ఫ్యూటోరికో, యూఎస్ వర్డిన్ ఐలాండ్స్‌లో అత్యవసర పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హరికేన్ హార్వే కంటే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.













