విశ్వంలోని ఓ గ్రహానికి అమ్మాయి పేరు
16 ఏళ్ల బెంగళూరు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. నీటి నాణ్యతను పెంచే దిశగా ఆమె చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ అవార్డు దక్కడంతోపాటు విశ్వంలోని ఓ చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు. పన్నెండో తరగతి చదువుతున్న సాహితి పింగళికి ఈ గౌరవం దక్కింది. ఈ నెల మొదట్లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో సాహితి పాల్గొన్నది. ఇన్నోవేటివ్ క్రౌండ్ సోర్సింగ్ అప్రోచ్ టు మానిటరింగ్ ఫ్రెష్‌వాటర్ బాడీస్ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకుగాను గోల్డ్ మెడల్ దక్కింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని లింకన్ లేబరేటరీకి విశ్వంలోని చిన్న గ్రహాలకు పేర్లు పెట్టే హక్కులు ఉన్నాయి. ఈ సైన్స్ ఫెయిర్‌లో ఇండియన్స్ మొత్తం 21 అవార్డులు దక్కగా అందులో మూడు సాహితికే దక్కాయి. ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ కేటగిరీలో ఓవరాల్‌గా రెండోస్థానంలో సాహితి నిలిచింది. తాను ఇది ఊహించలేదని, ఒక్క స్పెషల్ అవార్డు మాత్రమే తాను ఎక్స్పెక్ట్ చేశానని సాహితి చెప్పింది. ప్రస్తుతం సాహితి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నది.













