టెక్సాస్‌లో హెరికేన్ బీభత్సం..
గడిచిన 50 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో చుట్టుముట్టిన హార్వే హెరికేన్ ధాటికి టెక్సాస్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్ ఇంకా నీటిలోనే నానుతోంది. శుక్రవారం తుపాను తీరం దాటగా, ఇప్పటికీ వర్షం విరామం లేకుండా కురుస్తూనే ఉంది.
దీంతో హూస్టన్ సహా పటు పట్టణాలు, కంట్రీల్లో జనజీవనం దాదాపుగా స్థంభించింది. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. మూడు అడుగుల మేర ముంచేసిన నీళ్లగుండా లక్షల మంది ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటివరకు వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం హెరికేన్ ధాటికి కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హూస్టన్, హారిస్‌కౌంటీ తదితర ప్రాంతాల్లో 76 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరంలో నివాస ప్రాంతాలు, ఇళ్లు, హైవేలు అన్నీ ఇప్పటికీ నీట మునిగే ఉన్నాయి. ఈ వారం చివరి దాకా హరికేన్ ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో 30 వేలకు పైగానే జనం తమ ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో తలదాచుకోవలసిన పరిస్థితి ఉండవచ్చని అధికారులు అంటున్నారు.













