నిన్న టెక్సాస్… నేడు లూసియానా
టెక్సాస్ రాష్ట్రాన్ని నిన్నటిదాకా కుండపోత వర్షాలతో ముంచెత్తిన హార్వే హరికేన్ బుధవారం మరోసారి లూసియానా రాష్ట్రంపై తన ప్రతాపాన్ని చూపించింది. అయిదు రోజుల క్రితం హోస్టన్ నగరానికి దగ్గర్లో తీరాన్ని దాటిన తర్వాత హార్వే హరికేన్ సముద్రం వైపు మళ్లినప్పటికీ బుధవారం తిరిగి లూసియానా రాష్ట్రంలోని కామెరాన్ వద్ద తీరాన్ని దాటిందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా గంటలకు 72 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులతోపాటుగా 13 నుంచి 25 సెంటీమీటర్ల దాకా కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు ఆ కేంద్రం తెలిపింది. మరో 48 గంటలపాటు లూసియానాతో పాటుగా పొరుగు రాష్ట్రమైన మిసిసిపిలో భారీ వర్షాల ముప్పు కొనసాగవచ్చని, ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని హరికేన్ సెంటర్ తెలిపింది. హార్వే తుపాను కారణంగా రోడ్లన్నీ నదుల్లాగా మారిపోయిన హోస్టన్ నగరంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.













