హెచ్1బి బదులు ‘ఒ’ వీసా!
హెచ్1 బి వీసా కోసం దరఖాస్తు చేయాలనుకునేవారికి ఆ వీసా బదులు ఒ వీసాకు దరఖాస్తు చేయాలన్న సలహాలు అందుతున్నాయని అమెరికాలోని ప్రముఖ సెనేటర్ చక్ గ్రాస్లే ఆరోపించారు. బాగా నైపుణ్యమున్నవారికి హెచ్1బి వీసాలనుద్దేశించగా అద్భుత సామర్థ్యాలు, అద్భుత విజయాలు నమోదు చేసిన వారికి ఒ వీసాలను జారీ చేస్తారు. హెచ్1 బి వీసాలకు సంఖ్యా పరిమితి ఉండగా ఒ వీసాలకు పరిమితి లేదు. ఈ వీసాల సంఖ్య గడిచిన దశాబ్దంలో మూడింతలయిందని భారత మీడియా కథనాలను ఉటంకిస్తూ చక్ గ్రాస్లే చెప్పారు. 2006లో 30వేలుగా ఈ వీసాల సంఖ్య 2016 నాటికి లక్షకు చేరడం ఆందోళనకరమన్నారు. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన వీసాలను హెచ్1బి వీసాలకు బదులుగా ఇవ్వలేరని, హెచ్1బి వీసాను పొంద లేకపోయినకారణంగా ఒ వీసా నిబంధనలను అతిక్రమిస్తే వీసా అవకతవకలకు పాల్లడినట్టేనని చెప్పారు. ఈ మేరకు ఆయన అమెరికా అంతర్గత భద్రత వ్యవహారాల కార్యదర్శి జాన్ కెల్లీకి లేఖ రాశారు.













