విజయవంతంగా “తామా” సాహితీ సదస్సు
అట్లాంటా తెలుగు సంఘం “తామా” నిర్వహించిన సాహితీ సదస్సు జూన్ 10, 2017 న ఆల్ఫారెట్టాలోని తామా కార్యాలయంలో జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు మరియు సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ గాలి గుణశేఖర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ సదస్సులో సుమారు 60 మందికి పైగా పాల్గొన్నారు.
తామా సాహిత్య కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స కార్యక్రమాన్ని స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. ముందుగా డాక్టర్ పాపినేని శివ శంకర్ గారిని వేదిక మీదకు ఆహ్వానించగా, తామా బోర్డు చైర్మన్ నగేష్ దొడ్డాక పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అలాగేడాక్టర్ గాలి గుణశేఖర్ గారిని వేదిక మీదకు ఆహ్వానించగా, తామా అధ్యక్షులు శ్రీ హర్ష యెర్నేని పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. తదుపరి తామా సాహిత్య కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స డాక్టర్ పాపినేని శివశంకర్ గారి గురించి మరియు డాక్టర్ గాలి గుణశేఖర్ గారి గురించి ప్రసంగిస్తూ, వారి ప్రతిభాపాఠవాలను మరియు సాహిత్యంలో వారు సాధించిన విజయాలను సభికులకు తెలియజేసారు.
ముందుగా కవి, కథకులు, మరియు విమర్శకులు అయిన డాక్టర్ పాపినేని శివశంకర్ గారు ప్రాచీన ఆధునిక కవిత్వాలు మరియు జాతీయ పురస్కారం అందించిన రజనీగంథ గురించి ప్రసంగించారు. ఈమధ్యన సమాజంలో సాహితీవేత్తలు కూడా ప్రాంతీయభేదాలను ఎదుర్కోవడం గురించి ఆవేదన వ్యక్తం చేసారు. తన ప్రసంగాన్ని ఆసాంతం ప్రతిఒక్కరు ఎంతో శ్రద్ధగా వినడం విశేషం. తదనంతరం తెలుగు తమిళ్ ఇంగ్లీష్ భాషల్లో డిగ్రీ పుచ్చుకున్న విలక్షణమైన సాహితీవేత్త, లెక్చరర్, రీడర్, మరియు ప్రిన్సిపాల్ గా పనిచేసిన డాక్టర్ గాలి గుణశేఖర్ గారు చాటు కవిత్వం అనే అంశంపై ప్రసంగించారు. సాహిత్యంలో వ్యంగ్యం, హాస్యం, మరియు సమాజాన్ని మేలుకొలిపే విషయాలపై తనదైనశైలిలో వివరించగా సభికులందరూ హర్షధ్వానాలతో అభినందించారు. తమ దైనందిన జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ అట్లాంటా తెలుగు సంఘం “తామా” సభ్యులు ఇలాంటి భాషా సాహితీ కార్యక్రమాలు నిర్వహించడం గొప్పవిషయం అంటూ ఇరువురు సాహితీవేత్తలు కొనియాడారు. అలాగే ప్రస్తుత ఫేస్బుక్ మరియు వాట్సాప్ వాడకంమీద విజు చిలువేరు గారు వినిపించిన కవిత అందరిని నవ్వులలో ముంచింది.
తదనంతరం తెలుగు విశ్వ విద్యాలయం నుంచి సాహితీ పురస్కారం అందుకున్న డాక్టర్ పాపినేని శివ శంకర్ గారిని విజు చిలువేరు గారు మరియు ప్రభాకర్ రావు కడియాల గారు శాలువాతో సత్కరించగా, మనబడి ఒకప్పటి గురువర్యులు అరుంధతి కోడూరు గారు మరియు తామా బోర్డు సభ్యులు కృష్ణ బొజ్జ గారు జ్ఞాపికను బహుకరించారు. అలాగే తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వందలకొద్దీ సాహితీ ఉపన్యాసాలు మరియు రేడియో కార్యక్రమాలు ఇచ్చిన డాక్టర్ గాలి గుణశేఖర్ గారిని అప్పారావు చాపరాల గారు మరియు తామా బోర్డు సభ్యులు వెంకట్ మీసాల గారు శాలువాతో సత్కరించగా, తామా సాహిత్య కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స మరియు ఉపాధ్యక్షులు మనోజ్ తాటికొండ జ్ఞాపికను అందజేశారు.
చివరిగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు, డాక్టర్ పాపినేని శివశంకర్ గారిని తామా సాహితీ సదస్సుకు తెచ్చిన యశ్వంత్ జొన్నలగడ్డ గారికి, మైత్రి సభ్యులకు, కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులకు, సాహితీవేత్తలు డాక్టర్ పాపినేని శివశంకర్ గారికి మరియు డాక్టర్ గాలి గుణశేఖర్ గారికి తామా సాహిత్య కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స కృతజ్ఞతలు తెలియజేయగా, తేనీయ విందుతో కార్యక్రమం ముగిసింది.








