తెలంగాణ సాధనకు ఎన్నారైలు తోడ్పాటు అందించాలి
బంగారు తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేశర్రావు నేతృత్వంలో ఎన్నారైలు తోడ్పాటునందించాలని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలోని తెలుగు సంఘాలల ఆధ్వర్యంలో జార్జియాలోని ఆటా, ఘటా, టాటా, తానా సంఘాల ప్రతినిధులు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశం గర్వించే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధిని సాధిస్తున్నదని అన్నారు. ఎన్ఆర్ఐలు తమ సొంత ఊళ్లలోని చెరువులను దత్తత తీసుకోవాలని మంత్రి కోరారు. మిషన్ భగీరథ మహిళల కష్టాలను దూరం చేస్తుందని అన్నారు. ప్రజా రవాణాను మెరుగు పరించేందుకు సీఎం కేసీఆర్ రూ.రెండువేల కోట్లు ఇచ్చి ఆధునీకరించారని చెప్పారు. నష్టాల్లో ఉన్న డిపోలను ఎన్నారైలు దత్తత తీసుకోవాలని సూచించారు. తద్వారా పల్లె, పట్నాన్ని ఏకం చేస్తూ ప్రజా రవాణాకు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆటా నాయకులు దయాకర్‌రెడ్డి, ఆశిరెడ్డి రుణాకర్రెడ్డి, బిడ్డిరెడ్డి అనిల్, టాటా టీం నాయకులు శ్రీధర్ కొంకాల, గౌతం గోలీ, సుంకి భరత్ మడాటీ, గాటా నాయకులు ప్రశీల్, గండ్ర శంకర్, గేట్స్ నాయకులు ప్రశాంత్ అశీరెడ్డి, వెంకట్ కావూరి పాల్గొన్నారు.








