మిస్ వరల్డ్ కెనడా పోటీల్లో ఖమ్మం అమ్మాయి
కెనడా అందాల పోటీలకు ఎంపికైంది ఓ తెలుగు అమ్మాయి. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన కల్యాణపు శ్రావ్య ‘మిస్ వరల్డ్ కెనడా’ పోటీలకు సెలక్టైంది. 1996లో జన్మించిన శ్రావ్య ప్రాథమిక విద్యాభ్యాసం ఆదిలాబాద్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో కొనసాగింది. ఆ సమయంలో శ్రావ్య తండ్రి రవికుమార్ ఇచ్చోడ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తుండేవారు. తర్వాత శ్రావ్యకు దాదాపు పదేళ్ల వయసు(2005)లో ఆమె తండ్రి రవికుమార్ ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ప్రస్తుతం శ్రావ్య యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలో కెమికల్ ఇంజినీరింగ్ చదవుతోంది. థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయిన ఆమెకు మోడలింగ్‌పై ఎంతో ఆసక్తి ఉండేది. మూడేళ్ల కిందటే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన శ్రావ్య.. ఇప్పటికే ‘మిస్ నార్తర్న్ అల్బర్టా’ కిరీటం కైవసం చేసుకుంది. ఈ జులై 16 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘మిస్ వరల్డ్ కెనడా-2017’ పోటీలకు ఎంపికైంది. శ్రావ్య విజయం సాధించాలని ఆదిలాబాద్‌లోని ఆమె చిన్ననాటి మిత్రులు, స్కూలు యాజమాన్యంతో పాటు సొంత జిల్లా ఖమ్మం వాసులు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్‌లో ఆమె పేరిట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.













