వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన ఫస్ట్‌లేడీ
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన ఆరు నెలల తర్వాత ఆమె అధ్యక్ష భవనానికి వచ్చారు. కొడుకు 11 ఏళ్ల బారన్ ట్రంప్‌తో కలిసి ఆమె వాషింగ్టన్ వచ్చారు. ఇన్నాళ్లూ ఆమె న్యూయార్క్‌లోనే ఉన్నారు. బారన్ అకడమిక్ ఇయర్ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ వచ్చేసినా, ఆమె మాత్రం న్యూయార్క్‌లో ఉండిపోయారు. ఇప్పుడు బారన్ వాషింగ్టన్ సమీపంలోని సెయింట్ ఆండ్రూస్ ఎపిస్కోపల్ స్కూల్‌కు వెళ్లనున్నాడు. వైట్‌హౌజ్‌కి వచ్చిన తర్వాత మెలానియా సౌత్ లాన్, వాషింగ్టన్ మాన్యుమెంటల్లను చూస్తూన్న ఫొటోను ట్వీట్ చేశారు. అధ్యక్షుడితో పాటు కాకుండా వైట్‌హౌజ్‌కు ఆలస్యంగా వచ్చిన తొలి ఫస్ట్‌లేడీ మెలానియానే. ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచీ కూడా మెలానియా కాస్త దూరంగానే ఉన్నారు. తొలిసారి విదేశీ పర్యటనకు ట్రంప్ వెళ్లినపుడే ఆయనతో పాటు మెలానియా వార్తల్లో నిలిచారు.













