ఉద్యోగుల కోసం ఇళ్లు : ఫేస్బుక్
కాలిఫోర్నియాలోని సిలికాన్వాలీలో తమ ఉద్యోగులకు ఇళ్ల కొరత ఏర్పడటంతో ఫేస్బుక్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉద్యోగులకు ఇళ్లు కట్టించాలని నిర్ణయానికి వచ్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు ఫేస్బుక్ ఇంటర్నెట్ సదుపాయం ఉండే బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు కార్యాలయాలకు దగ్గరగా ఇళ్లు తీసుకొని ఉండే ఉద్యోగులకు 10 వేల డాలర్లను ఇన్సెంటీవ్స్గా ఇస్తోంది. ఇలాంటి చర్యలు ఉద్యోగుల ఇళ్ల సమస్యలను తీర్చలేవని భావిస్తోంది. ఉద్యోగులకు ఇళ్లు కటించి ఇవ్వడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించింది. శాన్ఫ్రాన్సిస్కోకు 45 మైళ్ల దూరంలో ఉండే మెన్లోపార్క్లో ఇళ్లు నిర్మాణాలకు ప్రణాళికలు రచిస్తోంది. అక్కడ ఉద్యోగుల కోసం గ్రామాన్ని నిర్మిస్తామని, ఇందులో కొంత స్థలాన్ని కార్యాలయానికి, మరికొంత స్థలాన్ని ఇతర కార్యక్రమాల కోసం వినియోగిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ప్రాంతంలో నిర్మించే 1500 ఫేస్బుక్ హౌజింగ్ యూనిట్లను ఉద్యోగులే కాకుండా ఎవరైనా కొనుక్కోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వీటిలో 15 శాతం ఇళ్లను మార్కెట్ రేట్ల కంటే తక్కువకే అందిస్తామని పేర్కొంటున్నారు.













