మళ్లీ తండ్రి కాబోతున్న జుకెర్‌బర్గ్
చిన్నారి మాక్స్ తర్వాత మళ్లీ మా కుటుంబానికి మరో చిట్టిపొట్టి అతిథి రాబోతున్నారని ప్రకటించాడు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్. అందుకే తాను మళ్లీ ఓ రెండునెలల పాటు పితృత్వ సెలవును తీసుకోబోతున్నానన్నారు జుకెర్‌బర్గ్. ఈ దఫా పితృత్వ సెలవు విషయంలో తమ సంస్థ ఇస్తున్న వెసులుబాటును ఉపయోగించుకుంటూ రెండు విడతలుగా తీసుకుంటానన్నారు. నెలలు నిండుతున్న భార్య ప్రిసిల్లా, చిట్టితల్లి మాక్స్‌లను కనిపెట్టుకునే ఉంటానని చెప్పారు ఫేస్బుక్ బాస్. పుట్టబోయే బుల్లిపాపాయితో పాటూ మా చిన్ని కుటుంబంతో డిసెంబరు నెలంతా హ్యాపీగా గడిపేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్ లో పోస్టింగ్ చేశాడు.
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్ చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది. పెద్దసంఖ్యలో అభిమానులు మహా ముచ్చటపడిపోతున్నారు. జుకెర్‌బర్గ్ ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టిన 24 గంటల వ్యవధిలో 16వేల ‘షేర్’లు నమోదైనాయి. రెండోసారి తండ్రి కాబోతున్న జుకెర్‌బర్గ్ ఆనందం వర్ణనాతీతం. భార్య ప్రిసిల్లా ఛాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలాంటి సమయంలో కుటుంబం అంతా ఒకే చోట కలిసిమెలిసి ఉండటంలో ఉన్న ఆనందం అనిర్వచనీయం అంటున్నారు జుకెర్‌బర్గ్. మాక్స్ పుట్టినపుడు కూడా జుకెర్‌బర్గ్ ఇలాగే రెండు నెలల సెలవు తీసుకుని భార్య ప్రిసిల్లా, చిన్నారి చిట్టితల్లి మాక్స్ తో గడిపినప్పుడూ కూడా ప్రశంసల వర్షాలు కురిశాయి. పిల్లల జీవితంలో తండ్రి పాత్ర ఎంత ఉన్నతమైందో జుకెర్‌బర్గ్ తెలియచెప్పారు పలువురు కొనియాడారు. రెండో బిడ్డ పుట్టాక..తామంతా సరదాగా గడిపేస్తామనీ… మాక్స్‌ను తీసుకుని పర్యటనలకు వెళతామనీ కూడా జుకెర్ బర్గ్ ‘ఫేస్బుక్’లో పెట్టిన పోస్టింగ్‌లో పేర్కొడంతో లక్షలాది మంది అభిమానులు లైక్ లు కొట్టారు.













