ఈబీ-5 వీసాతో గ్రీన్‌కార్డు
అమెరికాలో గ్రీన్‌కార్డు (శాశ్వత నివాస అనుమతి) పొందాలనుకునే భారత కుటుంబాలు, ఈబీ-5 వీసా విధానాన్ని అనుసరిస్తే మేలని అమెరికా వలసల న్యాయవాది వాన్డి కిర్బీ తెలిపారు. హెచ్-1బీ ఉద్యోగ వీసాలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించిన నేపథ్యంలో గ్రీన్ కార్డుకు ఈబీ-5 నే సులభమైన మార్గమని అన్నారు. అమెరికాలో దాదాపు రూ.6.44 కోట్లు కనీస పెట్టుబడి పెట్టిన వ్యక్తి. ఈబీ-5కి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడితో పాటు ఆ వ్యక్తి జీవితభాగస్వామి, 21 ఏళ్ల లోపు వయసున్న సంతానం కూడా షరతులతో కూడిన గ్రీన్ కార్డులు పొందేందుకు అవకాశముంది. గ్రీన్‌కార్డు పొందిన తర్వాత దరఖాస్తుదారుడు పది మంది అమెరికా పౌరులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ వీసా విధానం సెప్టెంబరు 30తో ముగియనుంది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (సీఈసీ) లైసెన్సు పొందిన ప్రతి నిధిని సంప్రదించి దరఖాస్తుదారులు ఈబీ-5 పొందే ప్రక్రియను చేపట్టాలని, మోసపోకుండా జాగ్రత్తపడాలని కిర్చీ సూచించారు.













