డాలస్ లో ఘనంగా కరుణశ్రీ డా. జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి వేడుకలు
కరుణశ్రీ డా. జంధ్యాల పాపయ్య శాస్త్రి 105వ జయంతి ఉత్సవాలని డాలస్ లో (దేశీప్లాజా స్టూడియో) సెప్టెంబర్ 2 న వందలాది సాహిత్యాభిమానులు మధ్య కరుణశ్రీ అభిమాన సంఘం, డాలస్ ఘనంగా నిర్వహించింది. ఈవేడుకలకు కరుణశ్రీ పెద్ద కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ముఖ్య అతిధి గాను, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు, తెలుగు భాషాభిమాని డా. ప్రసాద్ తోటకూర ఆత్మీయ అతిధి గాను హాజరయి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా చిన్నారులు కరుణశ్రీ పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. కరుణశ్రీ మనువడు శ్రీనాథ్ జంధ్యాల కరుణశ్రీ వ్రాసిన కవిత్వాన్నివివరిస్తూ “కవితా వైజయంతి” అన్న పద్యమాలికను సభకు తెలియజేశారు. సభలో కరుణశ్రీ జీవిత రేఖలు, కరుణశ్రీతో ముఖాముఖీ దృశ్య మాలికను ప్రదర్శించారు.
ప్రత్యేక అతిధిగా హాజరైన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తాను గన్నవరం లోని వి. కె. ఆర్. కళాశాలలో చదువుకునే రోజుల్లో, విద్యార్థి సంఘ నాయకుడుగా కళాశాల వార్షికోత్సవాలకు 1975 లో గుంటూరు వెళ్లి కరుణశ్రీ గారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించడం, కరుణశ్రీ ఆ కళాశాలకు వచ్చి అద్భుతమైన రీతిలో ప్రసంగించిన తీరు ని ఆయన గుర్తుచేసుకున్నారు. కరుణశ్రీ సాహిత్యం కరుణ రసంతో, చాలా సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారాలతో ముఖ్యంగా ఆయన రాసిన పద్యాలు ఆయన నోటే పలికినప్పుడు వాటి హొయలు, సొగసు మరింత రమ్యంగా, హృద్యంగా, మధురంగా ఉండి కేవలం కవి, పండితులనే గాక, పామర జనులను కూడా ఆకర్షించేవి అన్నారు. కరుణశ్రీ వాస్తవిక సంఘటనలు నేపథ్యంగాతీసుకొని అద్భుతమైన కావ్యాలు సృష్టించారని, ఉదాహరణకు తన పదహారేళ్ళ ప్రాయంలో ఒక పారిశుధ్య కార్మిక బాలిక దుస్థితి చూసి చలించిపోయి “పాకీ పిల్ల” అనే కావ్యాన్ని రాశారన్నారు. కరుణశ్రీ రాసిన “పుష్ప విలాపం”లోని పద్యాలను అమర గాయకుడు ఘంటసాల పాడడంతో పువ్వుకు తావి అబ్భినట్ట్లయి, ఆ పద్యాలు సామాన్య ప్రజాబాహుళ్యం లోకి సైతం ఎంతగానో చొచ్చుకుపోయాయన్నారు.
కరుణశ్రీలాంటి తెలుగు జాతి ఆణిముత్యాల, గొప్ప సాహితీవేత్తల చరిత్రను భావితరాలకు తెలియజేయాలంటేప్రభుత్వం అధికార భవనాలకు లేదా విజ్ఞాన కేంద్రాలకు లేదా విశ్వవిద్యాలయాల్లో భాషా పరిశోధనా కేంద్రాలకు వీరి పేర్లు పెట్టాలని డా. ప్రసాద్ తోటకూర సూచించారు. తెలుగు కు ప్రాచీన భాషా హోదా లభించినప్పటికీ కేంద్రం నుంచి ఏటా వచ్చే 10-15 కోట్ల రూపాయలను తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం జాగు చేస్తోందని, తెలుగు భాషను, విధిగా ఒకటి నుంచి పదవ తరగతి వరకు భోదించాలనే ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నప్పటికీ, అమలు పరచిన దాఖలాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్య అతిధి డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ మాట్లాడుతూ తన తండ్రి కరుణశ్రీతో ఉన్న విడదీయరానిఅనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, తెలుగు బాల, పాకి పిల్ల, అమర ఖయ్యాం లోని పద్యాలను సోదాహరణంగా వివరించారు. ప్రముఖ సాహితీవేత్తలైన విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ లాంటి వారితో కరుణశ్రీకున్న సాహిత్యానుభందాన్ని తెలియజేసినప్పుడు శ్రోతలుచాలా ఆసక్తికరంగా విన్నారు. అమర గాయకుడు ఘంటసాలతో కరుణశ్రీకున్న మైత్రీ బంధాన్ని, పలుమార్లు ఇరువురు కలుసుకునే వారని చెప్పారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కరుణశ్రీ ఆంధ్రోపన్యాసకుడుగా పనిచేస్తున్నపుడు కొంగర జగ్గయ్య ఆయన దగ్గర చదువుకోవడాన్ని, ఆ తర్వాత జగ్గయ్య మంచి నటుడి గానే గాక, గొప్ప సాహితీపిపాసకుడుగా ఎదిగిన వైనాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో మద్దుకూరి చంద్రహాస్, సురేష్ కాజాలు కరుణశ్రీ సాహిత్యా విశేషాలను పంచుకున్నారు. కరుణశ్రీ చిత్రపటానికి సాహిత్యాభిమానులు పుష్పాంజలి ఘటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరుణశ్రీ అభిమాన సంఘం తరపున బుయ్యనప్రగడ శ్రీనివాస రావు (బి. ఎస్.ఆర్) వ్యాఖ్యాత గా సభను సమర్థవంతంగా నిర్వహించారు.








