బద్ధ శత్రువుతో డొనాల్డ్ ట్రంప్ భేటీ!
ఉత్తరకొరియా సమయం దొరికినప్పుడల్లా అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. అలాంటి దేశాధినేతతో అమెరికా అధ్యక్షుడు సమావేశమవుతారట. సరైన సమయంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్తో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవ్వాలనుకుంటున్నారని శ్వేతసౌధం వెల్లడించింది. అయితే ఈ సమావేశం కోసం ఉత్తరకొరియా అనేక షరతులను అంగీకరించాల్సి ఉంటుందని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియాతో మాట్లాడారు.
ఉత్తర కొరియా తన తీరును మార్చుకోకపోతే ఇరు దేశాధినేతల మధ్య సమావేశానికి అనుకూల పరిస్థితులు నెలకొనబోవని తెలిపారు. కిమ్ జాంగ్‌తో భేటీని గౌరవంగా భావిస్తున్నా అని ట్రంప్ చెప్పిన కొద్ది గంటల్లోనే వైట్‌హౌస్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్‌తో భేటీ అవడం సరైనది అనిపిస్తే, నేను కచ్చితంగా ఆయనతో సమావేశమవుతాను. దాన్ని నేను గౌరవంగా భావిస్తా అని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే సమయంలో వైట్‌హౌస్ కూడా ప్రకటన చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరైన సంబంధాలు లేవు. ఉత్తర కొరియా అణు పరీక్షలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఉత్తర కొరియా తన దూకుడు తగ్గిస్తేనే భేటీ సాధ్యమవుతుందని అమెరికా భావిస్తోంది.













